ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజు: చంద్రబాబు

  • మార్కాపురంలో చంద్రబాబు పర్యటన
  • నేడు మహిళా దినోత్సవం
  • మార్కాపురంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజవుతుందని హెచ్చరించారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని అన్నారు. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకే డ్వాక్రా ప్లాట్ ఫామ్ సృష్టించామని వెల్లడించారు. 

ఇక, తాను రాజకీయాల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదించలేకపోయానని... తన అర్ధాంగి భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంట్లో నాకు కూడా డబ్బులిచ్చే స్థాయికి భువనేశ్వరి ఎదిగారు అని చంద్రబాబు గర్వంగా చెప్పారు. 

పోలీస్ 'శక్తి' యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మార్కాపురం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ఆవిష్కరించారు. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా చంద్రబాబు ప్రారంభించారు.


More Telugu News