ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌... మెరుగైన‌ కోహ్లీ ర్యాంక్‌... టాప్‌-5లో ముగ్గురు భార‌త ప్లేయ‌ర్లు!

  • ఒక ర్యాంకు మెరుగుప‌ర‌చుకుని 4వ స్థానానికి ఎగ‌బాకిన కోహ్లీ
  • రెండు స్థానాలు పతనమై ఐదో ర్యాంక్‌కు దిగజారిన రోహిత్‌
  • నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లోనే కొన‌సాగుతున్న శుభ్‌మన్ గిల్‌
  • ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్ష‌ర్‌కు 13వ ర్యాంకు
  • బౌలింగ్ విభాగంలో 3 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి షమీ
ఐసీసీ... వ‌న్డే ర్యాంకింగ్స్ ను తాజాగా విడుద‌ల చేసింది. నిన్న ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్లో చెల‌రేగిన విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు మెరుగుప‌ర‌చుకుని 4వ స్థానానికి ఎగ‌బాకాడు. అదే స‌మ‌యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెండు స్థానాలు దిగ‌జారి ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెన్ 3వ స్థానానికి చేరుకున్నాడు. మరో భార‌త యువ ఓపెన‌ర్ శుభ్‌మన్ గిల్ మాత్రం నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లోనే కొన‌సాగుతున్నాడు. పాక్ స్టార్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజామ్ రెండో ర్యాంకులో ఉన్నాడు. టాప్‌-5లో ముగ్గురు భార‌త ప్లేయ‌ర్లు ఉండ‌టం విశేషం. 

ఇక ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం జరుగుతున్న‌ ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ నాలుగు మ్యాచ్‌ల్లో 26.66 సగటుతో 80 పరుగులు చేశాడు. అలాగే 4.51 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వ‌న్డే ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆల్ రౌండర్‌గా కొన‌సాగుతున్నాడు. ఈ యువ ఆట‌గాడు  2024 ఏడాదికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్న విష‌యం తెలిసిందే. 

కాగా, బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ మూడు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు సాధించ‌డం అత‌ని ర్యాంకు మెరుగవడానికి తోడ్పడింది.  


More Telugu News