రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి

  • ప్రమాద సమయంలో పడవలో 12 మంది
  • సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న 10 మంది
  • అనంతపురం జిల్లాలో బొలెరో బోల్తా పడి యువతి మృతి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో పడవలో 12 మంది ఉన్నారు. 10 మంది సురక్షితంగా బయటపడగా గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి.

అనంతపురంలో బొలెరో బోల్తా
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 35 మంది ఉన్నారు. వెనుక కూర్చున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు శ్రీక్యాతలింగేశ్వర, బొమ్మాలింగేశ్వర జాతరకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.


More Telugu News