ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఖాతా తెరవనున్న కాంగ్రెస్
- గత రెండు దఫాలుగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని వైనం
- ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలలో బాద్లీలో లీడ్
- రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారం చేసినా నిష్ప్రయోజనమే
ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, పార్టీ జాతీయ కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సేవలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆమె కుమారుడిని బరిలో నిలిపినా ఉపయోగం లేకుండా పోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు.