నేడు కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ

  • త్రివేణి సంగమంలో ఉదయం 11 గంటలకు పుణ్యస్నానం ఆచరించనున్న ప్రధాని మోదీ
  • ఉదయం పది గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని 
  • ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మహాకుంభమేళాలో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న రాత్రే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. 

ప్రధాని మోదీ ఉదయం పది గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్తారు. 11 గంటలకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా, భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 


More Telugu News