cm revanth reddy: పద్మ పురస్కారాల ఎంపిక.. సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

cm revanth reddy react on padma awards
షార్ట్స్‌లో చూడండి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అయితే పద్మ పురస్కారాల ఎంపికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని అన్నారు. 

గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం .. తెలంగాణకు కనీసం ఐదు అవార్డులు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ లేఖ రాయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ఆయన అభినందనలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మంద కృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య, పంచముఖికి పద్మ పురస్కారాలు లభించడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగాల్లో చేసిన కృషి, అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు దోహదపడ్డాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.    
Go Back to Shorts
cm revanth reddy
padma awards
Telangana

More Telugu News