Airbus: ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ.. హెచ్125 హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ‘ఎయిర్‌బస్?’

Airbus company ready to invest in AP
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ తరలివస్తోంది! రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ‘ఎయిర్‌బస్’ నిర్ణయించినట్టు తెలిసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని, హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టు చెప్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

‘హెచ్125’ అనేది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించవచ్చు. పర్యాటకంగానూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అలాగే, సరిహద్దుల్లో పహారా, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఇది పూర్తి అనువుగా ఉంటుంది. గరిష్ఠంగా గంటకు 289 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న హెలికాప్టర్ కూడా ఇదే. దీనికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియాలో ఈ హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేయాలని ఎయిర్‌బస్ భావిస్తోంది. 
Go Back to Shorts
Airbus
H125 Helicopter
Andhra Pradesh
Anantapur

More Telugu News