Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారు: వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

Chandrababu talks about nature farming
Advertisement
  • నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
  • వైసీపీ నేతలు బురదచల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు
  • సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని వెల్లడి 
  • రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని స్పష్టీకరణ
Advertisement
సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని చంద్రబాబు సవాల్ విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

"సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. వైసీపీ హయాంలో రూ.9 వేల కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉంది. మేం నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్నాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

సేంద్రియ సాగుకు నేనే శ్రీకారం చుట్టాను

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని తెలిపారు. ఏపీలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రకృతి సాగుద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. టెక్నాలజీ ద్వారా... మనం తినే ఆహార నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని, ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని అన్నారు.  

ప్రస్తుతం సాగు విధానంలో పెనుమార్పులు వస్తున్నాయని... చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందని వివరించారు. చీడపీడల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులు మారాయని తెలిపారు. మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా చీడపీడలను గుర్తించే సాంకేతికత వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. 

ఇక, పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటామని, పశువులకు ఎక్కడిక్కడ షెడ్లు నిర్మిస్తామని, పశువుల మేత కోసం గడ్డి పెంచే క్షేత్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలకు తావు లేకుండా టెక్నాలజీ వినియోగిస్తామని అన్నారు. 

తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తామని, తిరుపతి జిల్లాకు చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని చెప్పారు. ఇక, విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని... ఆఫ్ లైన్, ఆన్ లైన్ నాలెడ్జ్ పెంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు. 

Advertisement
Advertisement
Chandrababu
Nature Farming
Andhra Pradesh

More Telugu News