AP Maker Lab On Wheels: ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh inspects AP Maker Lab On Wheels
షార్ట్స్‌లో చూడండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ  ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. 

రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నేడు పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. 

పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్‌ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ESG విజన్ 2030 ( ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, STEM లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్–ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. 

ఏపీ మేకర్ ల్యాబ్‌లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. 

ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లతో ల్యాబ్ తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమేగాక విద్యార్థులకు కోర్సు కంటెంట్ తో పాటు ట్రైనర్ సపోర్టు అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున రూ.1,500 ఖర్చుచేస్తుంది. 

ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి. గణేశ్ కుమార్, ఇన్ఫోసిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Go Back to Shorts
AP Maker Lab On Wheels
Nara Lokesh
Infosys
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News