మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్ ఇప్పుడే చెప్పేస్తుందట!
- కృత్రిమ మేధతో డెత్ క్లాక్ యాప్ తయారు చేసిన అమెరికా కంపెనీ
- జులైలో మార్కెట్లోకి రిలీజ్ చేయగా.. 1.25 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట
- ఆహారం, వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రించే సమయం తదితర వివరాల ఆధారంగా మరణం అంచనా
అమెరికాకు చెందిన సెన్సర్ టవర్ కంపెనీ ‘డెత్ క్లాక్’ యాప్ ను తయారుచేసింది. కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఈ యాప్ చావును ముందుగానే అంచనా వేసి చెబుతుందట. ఏకంగా 53 మిలియన్ల మందిని ప్రశ్నించి, మనిషి జీవితకాలానికి సంబంధించి జరిపిన 1,200 లకు పైగా అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి ఈ యాప్ ను రూపొందించినట్లు కంపెనీ వివరించింది. గత జులైలో ఈ యాప్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయగా.. ఇప్పటి వరకు 1.25 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.
ఎప్పుడు మరణిస్తామనే విషయం తెలుసుకోవడానికి ఈ యాప్ లో ముందుగా వయసు, తీసుకునే ఆహారం, రోజూ చేసే వ్యాయామం, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి స్థాయులు, రోజువారీగా నిద్రించే సమయం తదితర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని దీని రూపకర్త బ్రెంట్ ఫ్రాన్సన్ తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఈ యాప్ మీరు చనిపోయే డేట్ ను అంచనా వేసి చెబుతుందని వివరించారు. ఈ యాప్ తో ఉపయోగం ఏంటని అడగగా.. మరింత ఎక్కువ కాలం జీవించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని ఫ్రాన్సన్ చెబుతున్నాడు. మరణించే తేదీ గురించి అంచనా తెలిశాక మనకు తెలియకుండానే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పనిసరిగా అలవాటు చేసుకుని హెల్తీ లైఫ్ లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.