చంద్రబాబు నాకు స్ఫూర్తి.. ఆయన అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం: పవన్ కల్యాణ్
- చంద్రబాబు అనుభవం ఏపీకి బలమన్న పవన్ కల్యాణ్
- అధికారులు పారదర్శకంగా పని చేయాలని హెచ్చరిక
- చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య
- పల్లెల్లో వెలుగులు నిండాలన్న డిప్యూటీ సీఎం
- రోడ్ల పనులు సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామన్న పవన్
గత వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఎంతో పారదర్శకంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రజలంతా బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, పల్లెల్లో వెలుగులు నిండాలని అన్నారు. ఇవన్నీ జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని... ఆ పార్టీని ఓడించేందుకు గట్టిగా కృషి చేశామని చెప్పారు. చంద్రబాబు బలమైన నాయకత్వం వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. పరిపాలన వేరు, రాజకీయాలు వేరని చెప్పారు.
3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేశారు. సంక్రాంతి నాటికి రోడ్ల పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకొస్తున్నారని చెప్పారు. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పంచాయతీ పనులు కొనసాగుతాయని అన్నారు. రూ. 4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులు చేస్తున్నామని చెప్పారు.