పాత రికార్డును ఎలా ‘తొక్కేశారో’ చూడండి!!
- నెదర్లాండ్స్ లో ఏకంగా 180 అడుగుల 11 అంగుళాల సైకిల్ తయారీ
- ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ గా సరికొత్త గిన్నిస్ రికార్డు
- 155 అడుగుల 8 అంగుళాల పేరిట ఉన్న పాత రికార్డు బద్దలు
నెదర్లాండ్స్ కు చెందిన 39 ఏళ్ల ఇవాన్ షాల్క్ నేతృత్వంలోని బృందం ఈ సైకిల్ ను తయారు చేసింది. చిన్నప్పుడే ఇవాన్ కు ఇలాంటి భారీ సైకిల్ తయారు చేయాలన్న ఆలోచన ఉండేదట. ఈ విషయాన్ని అతను స్వయంగా వెల్లడించాడు. ఓసారి ఎవరో గిన్నిస్ బుక్ ను బహుమతిగా ఇస్తే అందులో కనిపించిన అతిపెద్ద సైకిల్ రికార్డును చూడగానే ఇవాన్ మనసు పారేసుకున్నాడట. ఎప్పటికైనా గిన్నిస్ రికార్డుకెక్కే సైకిల్ తయారు చేయాలని కలలు కని 2018 నుంచి ప్రణాళికలు రచిస్తున్నాడట. అయితే కోవిడ్ వైరస్ వ్యాప్తి వల్ల రెండేళ్లు దీని తయారీకి బ్రేక్ పడినప్పటికీ ఎట్టకేలకు దాన్ని ఇలా సాకారం చేసుకున్నాడన్నమాట.
ఈ సైకిల్ తయారీతోపాటు రికార్డు సాధించేందుకు ఇవాన్ బృందం సైకిల్ ను 100 మీటర్ల దూరంపాటు తొక్కిన వీడియోను గిన్నిస్ బుక్ సోషల్ మీడియాతో పంచుకుంది. అందులో సైకిల్ వెనక వైపు నలుగురు వ్యక్తులు పెడల్స్ తో తొక్కుతుంటే ఇవాన్ సైకిల్ ముందు సీట్లో హ్యాండిల్ పట్టుకొని కూర్చోవడం కనిపించింది.
వాస్తవానికి 1965లోనే గిన్నిస్ బుక్ లోకి అతిపెద్ద సైకిల్ రికార్డు చేరిపోయింది. 26 అడుగుల 3 అంగుళాల పొడవుండే సైకిల్ ను జర్మనీలో తయారు చేశారు. ఆ తర్వాత కాలంలో న్యూజిలాండ్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియాతోపాటు నెదర్లాండ్స్ కు చెందిన రెండు జట్లు కూడా అతిపెద్ద సైకిల్ తయారు చేసి గిన్నిస్ లోకి ఎక్కాయి.