ఒకరి ఐఆర్సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా?.. రైల్వే సమాధానం ఇదే!
- సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఇండియన్ రైల్వేస్
- స్నేహితులు, బంధువులకు బుక్ చేసుకోవచ్చని వెల్లడి
- వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్ బుకింగ్‌పై పరిమితి లేదని స్పష్టత
ఐఆర్సీటీసీపై ఒకరి ఐడీ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుశిక్ష పడుతుందనేది అవాస్తవమని, ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఈ-బుకింగ్‌కు సంబంధించిన పలు నిబంధనలను వెల్లడించింది.
1. ఐఆర్సీటీసీ యూజర్లు వారి వ్యక్తిగత ఐడీని ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు టిక్కెట్లు బుక్ చేయవచ్చు. వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్ల బుకింగ్‌పై ఎలాంటి పరిమితి లేదు.
2. ఇక వ్యక్తిగత ఐడీని ఉపయోగించి నెలకు గరిష్ఠంగా 12 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరో వ్యక్తి ఆధార్‌ను కూడా అనుసంధానించి ఇద్దరి ఐడీలపై కలిపి నెలకు గరిష్ఠంగా 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
అయితే వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి బుక్ చేసిన టిక్కెట్లు వాణిజ్యపరంగా విక్రయించకూడదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 143 ప్రకారం ఇలాంటి కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని బట్టి ఐఆర్సీటీసీపై వ్యక్తిగత అవసరాలు, అవసరమైతే తమ బంధువులు, స్నేహితులకు బుక్ చేసుకోవచ్చని స్పష్టమవుతోంది.