మరో సీమా హైదర్.. పబ్‌జీ ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు అమెరికా యువతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో సీమా హైదర్.. పబ్‌జీ ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు అమెరికా యువతి

Florida female PUBG gamer came to India for lover and get married
  • గతంలో పాక్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్
  • ఇప్పుడు ఫ్లోరిడా నుంచి చండీగఢ్ వచ్చిన యువతి
  • అక్కడే ఆమెను పెళ్లాడిన ప్రేమికుడు
  • ఆపై భార్యతో కలిసి యూపీలోని స్వగ్రామానికి రాక
  • అనుమానం వచ్చి పోలీసులకు గ్రామస్థుల సమాచారం
  • అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
సీమా హైదర్ గుర్తుందా? పబ్‌జీ ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి అతడినే పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు ఇలాంటిదే మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ (30) అనే యువతికి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్‌జీ ఆట ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.

ప్రేమికుడిని కలుసుకునేందుకు బ్రూక్లిన్ కొన్ని నెలల క్రితం చండీగఢ్ చేరుకుంది. తన కోసం వచ్చిన ఆమెను కలుసుకునేందుకు హిమాన్షు చండీగఢ్ చేరుకున్నాడు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అక్కడే ఉండి ఆ తర్వాత ఇటావా చేరుకున్నారు.

విదేశీ యువతితో వచ్చిన హిమాన్షును చూసి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి ఇద్దరూ మళ్లీ చండీగఢ్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే, అప్పటికే ఆ డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం ఉండడంతో అతడు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌ ముందు ఆపాడు. ఆ వెంటనే పోలీసులు హిమాన్షు, బ్రూక్లిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఎస్పీ విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయంలో యువకుడి తప్పిదం ఏమీ లేదని, యువతి పూర్తి అంగీకారంతో వారి వివాహం జరిగిందని, ఇద్దరూ కలిసి చండీగఢ్ వెళ్లాలనుకోవడం కూడా ఆమె నిర్ణయమేనని తెలిపారు. దీంతో కథ సుఖాంతమైంది.
Advertisement
Pubg Love
America
Florida
Uttar Pradesh

More Telugu News