మీకు ఇంకా ఎందుకు ఆ సందేహం?: చంద్రబాబు సూటి ప్రశ్న
- ఎన్డీయేతోనే తన పయనమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత
- ఎన్డీయే భాగస్వాముల సమావేశం అనంతరం మీడియాతో ముచ్చటించిన బాబు
- ఎన్నికల్లో కలిసి పోరాడామని, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత కూడా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీఏలోనే కొనసాగనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. శివసేన నేత ఎక్‌నాథ్ షిండే, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయే కూటమి నేతలు మోదీకి లిఖితపూర్వకంగా తమ మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం ఖరారైపోయింది. శనివారం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా ఎన్డీయే భాగస్వాములందరూ హాజరుకానున్నారు.