అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం.. నరసరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
- పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- వీడియో వెలుగులోకి రావడంతో అరెస్ట్‌కు ఈసీ ఆదేశం
- అప్పటికే పరారైన వైసీపీ ఎమ్మెల్యే
- ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ అరెస్టు నుంచి ఉపశమనం
- కోర్టు షరతు ప్రకారం గత రాత్రి 12 గంటలకు ఎస్పీ ఎదుట హాజరు
హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.
ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు.
ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, తనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు.