ఇది రాజకీయ ఆర్థిక కుట్ర... ఈసీ వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

Varla Ramaiah and other TDP leaders met AP CEO
  • ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అవసరమేంటన్న వర్ల రామయ్య
  • ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపణ
  • దీనిపై చంద్రబాబు ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశారని వెల్లడి
సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్‌బిఐ నుంచి రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకువచ్చిందని, ఆ డబ్బును జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాకటర్లకు దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఇంతటి రాజకీయ ఆర్థిక కుట్రలో భాగ్యులైన సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ...”ఏపీఎండీసీ ద్వారా వచ్చిన రూ.7 వేల కోట్లు, ఇప్పుడు కొత్తగా తీసుకున్న రూ.4 వేల కోట్లను జగన్ తన సొంత, బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. సీఎస్ జవహర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలు ఇద్దరూ కుమ్మక్కై రాజకీయ ఆర్థిక కుట్రకు పాల్పడుతున్నారు. ఇది ఆర్థిక నేరం. 

ప్రైవేటు ఆసుపత్రులకు రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ ఛాంబర్‌కు రావల్సిన సుమారు రూ.8 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించలేదు. పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం తొందర వచ్చిందని హుటాహుటీన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పుడు చెల్లిస్తున్నారు? 

పద్ధతి ప్రకారం కాకుండా సొంత కాంట్రాక్టర్లను ఏరికోరి వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై గవర్నర్ గారికి మా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రేపు గవర్నర్‌ను కలిసి జగన్ రెడ్డి ప్రభుత్వం పన్నుతున్న కుట్రపై ఫిర్యాదు చేస్తాం” అని తెలిపారు. 

ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరి అఖిల్ తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
Varla Ramaiah
AP CEO
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News