గవర్నర్‌పై రాజ్‌భవన్ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఫిర్యాదు! పశ్చిమ బెంగాల్‌లో కలకలం
- రాజభవన్‌లో పనిచేస్తున్న ఓ మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు
- ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనన్న పోలీసులు
- పలు మార్లు లైంగిక వైధింపులు ఎదుర్కొన్నట్టు మహిళ ఫిర్యాదు చేసిందని వెల్లడి
- ఈ ఆరోపణలను ఖండించిన గవర్నర్, అంతిమంగా నిజానిదే విజయమని స్పష్టీకరణ
‘‘రాజ్‌భవన్‌లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనలాగా అనేక మంది బాధితులు ఉన్నారని ఆ మహిళ ఆరోపిస్తోంది. మహిళల గౌరవమర్యాదలపై మోదీ, షాలకు నిజంగా నమ్మకం ఉంటే వెంటనే బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
మరోవైపు, ఈ ఆరోపణలను బెంగాల్ గవర్నర్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలనీ, తన పరువుకు భంగం కలిగించేందుకు ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘అంతిమ విజయం నిజానిదే. ఇలాంటి కల్పిత ఆరోపణలకు నేను భయపడేది లేదు. నా పరువు తీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ, బెంగాల్‌లో అవినీతి, హింసపై నా పోరాటాన్ని వారు ఆపలేరు’’ అని సీవీ ఆనంద బోస్ అన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ సిబ్బందిని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన చేశారు. అంతకుముందు రాజ్‌భవన్ సిబ్బంది ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయనపై ఆరోపణలను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.