కాంగ్రెస్‌లోనే పుట్టాను... కాంగ్రెస్ పార్టీలోనే చస్తాను: సినీ నిర్మాత బండ్ల గణేశ్
- పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
- తెల్లారి లేస్తే రాముడిని, వెంకటేశ్వరస్వామిని తలుచుకునే తామే అసలైన హిందువులమన్న బండ్ల గణేశ్
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి గర్వపడతానని వ్యాఖ్య
'బాబూ, నాకు 50 సంవత్సరాలు. 34 ఏళ్లు శబరిమలై వెళ్లి వచ్చాను. నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు. మీరు శ్రీరామ్ శ్రీరామ్ అంటూ పేరెత్తుతున్నారు. కానీ నేను బతికేదే శ్రీరాముడిని నమ్ముకొని... మేం నమ్ముకునేదే ఆంజనేయుడిని. మేం ఉదయం నిద్రలేస్తే అంజనేయుడిని, వెంకటేశ్వరస్వామిని, అయ్యప్పను తలుచుకుంటాం. ముస్లిం, క్రైస్తవులను గౌరవిస్తాం.. మా కంటే హిందువులు ఎవరూ లేరు. మీరు హిందువు పేరు చెప్పుకుంటున్నారు.. మా అణువణువునా హిందుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ' అని వారికి సమాధానం ఇచ్చానన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో అందరికీ తెలుసునన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్, అంబేడ్కర్ ఆశయాలను నిలబెడుతున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. అందరినీ అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమే ధర్మమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడం గర్వకారణమన్నారు.