ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నా ధోరణి : విజయశాంతి
- తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే కావొచ్చన్న కాంగ్రెస్ నేత
- కొందరు విమర్శించినా ఎందుకో ఇదే ధోరణిలో ముందుకు సాగుతున్నట్టు వెల్లడి
- లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఆశిస్తున్నానన్న విజయశాంతి
తాను గెలిపించడానికి పనిచేసిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గం ప్రజల కోసం ఆ దిశగా ఇప్పటికే పనిచేస్తున్నారని, అమలు ప్రారంభమైన హామీలు దశలవారీగా పూర్తిస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని తన అభిప్రాయమని ఆమె పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలదని విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.