ముఖ్యమంత్రివా? లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?: రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
- కేసీఆర్ చెడ్డీ ఊడగొడతా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు
- పదేళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇలాగేనా మాట్లాడేదని ప్రశ్న
- హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోని పోస్ట్ చేసిన బీఆర్ఎస్
ఇటీవల ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిరిసిల్ల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ వేదికపై డిమాండ్ చేశారని గుర్తుచేశారు. వడ్లకు రూ.500 లు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు.
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర పదజాలంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ చెడ్డీ ఊడగొడతానని రేవంత్ రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ పై ఇలాంటి భాష ఉపయోగిస్తావా అంటూ రేవంత్ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.