3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమయ్యే విమానాలను ఎయిర్‌లైన్స్ రద్దు చేయవచ్చు.. తాజా మార్గదర్శకాల జారీ
- విమాన టికెట్‌పైనే మార్గదర్శకాల ముద్రణ
- ఫ్లైట్ రద్దయితే ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ భద్రత కల్పించాలి
- ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
విమాన టికెట్‌పైనే మార్గదర్శకాల ముద్రణ..
కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ను (CAR) ముద్రిస్తారు. ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీఏఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మధ్య పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇతర కీలక మార్గదర్శకాలు ఇవే..
- విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలియజేయాలి. అధికారిక వెబ్‌సైట్, బాధిత ప్రయాణికులకు మెసేజ్ లేదా వాట్సప్, ఈ-మెయిల్, ఇతర నోటిఫికేషన్ మార్గాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలి.
- ఎయిర్‌పోర్ట్‌లలోని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికుల పట్ల ఓపికగా నడుచుకోవాలి. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించాలి. ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తుండాలి.