కేజ్రీవాల్ ను నేడు అరెస్టు చేస్తారంటూ ప్రచారం.. సీఎం ఇంటి వద్ద సెక్యూరిటీ పెంపు!
- ఢిల్లీ సీఎం ఇంటి ముందు రోడ్లు బ్లాక్ చేసిన పోలీసులు
- మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఈడీ విచారణకు హాజరు కాని ఆప్ చీఫ్
- దీంతో అరెస్టు తప్పదనే ప్రచారం.. వదంతులేనని కొట్టిపారేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది. అయితే, విచారణకు పిలిచి కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారని ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కేజ్రీవాల్ ఈ నోటీసులను పట్టించుకోలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, ఆప్ ను అణిచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలని ఆరోపించారు. ఇటీవల మూడోసారి నోటీసులు పంపిన ఈడీ.. ఈ నెల 3న విచారణకు రమ్మంటూ కేజ్రీవాల్ కు సూచించింది. అయినా ఆయన విచారణకు రాలేదు. దీంతో కేజ్రీవాల్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.