పాక్ క్రికెట్‌పై మాజీ బౌలర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు
- ఆఫ్ఘనిస్థాన్‌పై చెత్తగా ఆడిందంటూ వకార్ విమర్శలు
- ఇక పాక్ క్రికెట్ గురించి మాట్లాడకపోవడం మంచిదన్న మాజీ
- ఆఫ్ఘనిస్థాన్ అద్భుతంగా ఆడిందని ప్రశంసలు
పాక్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ ప్రతిభతో దుమ్మురేపింది. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టి సంచలన విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఇంగ్లండ్‌ను కూడా ఇలాగే మట్టికరిపించి ప్రశంసలు అందుకుంది. ఈ విజయం గొప్పగా ఉందని ఆఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ అన్నాడు. తాము ప్రొఫెషనల్‌గా చేజ్ చేశామని పేర్కొన్నాడు. తాము క్వాలిటీ క్రికెట్ ఆడామని, దేశం కోసం, తమ ప్రజల కోసం ఓ చారిత్రాత్మక విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నట్టు టోర్నీ ప్రారంభంలోనే సహచరులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తొలుత ఇంగ్లండ్‌పై, ఆ తర్వాత పాకిస్థాన్‌పై అది చేసి చూపించామని వివరించాడు.
ఐదు మ్యాచుల్లో మూడింటిలో ఓడిన పాకిస్థాన్ ఇప్పడు క్లిష్టపరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టకుండా ఉండాలంటే ఇకపై అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. శుక్రవారం బలమైన దక్షిణాఫ్రికాను ఎదుర్కోనుంది. మరోవైపు, బంగ్లాదేశ్‌పై ఓటమి తమను తీవ్రంగా కలచివేసిందని పాక్ కెప్టెన్ బాబర్ అన్నాడు.