KCR: 80 వేల పుస్తకాలు చదివి ఇంజినీర్‌గా మారి కేసీఆర్ ‘కాళేశ్వరం’ నిర్మించారు.. కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan reddy lashes out at kcr after kaleshwaram incident
షార్ట్స్‌లో చూడండి
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం బ్యారేజీ వంతెన కుంగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. బ్యారేజీ పరిశీలించేందుకు వెళుతున్న వారిని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీలించేందుకు ఈటల రాజేందర్ వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. 

వేలకోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయని, నేడు ఆ అనుమానాలే నిజమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు తేటతెల్లమయ్యాయని వ్యాఖ్యానించారు. సూపర్ ఇంజినీర్లు, డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారని, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్‌గా మారి ప్రాజెక్టు నిర్మించారని ఎద్దేవా చేశారు. నిపుణులు, ఇంజినీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం సమస్యలమయంగా మారిందని దుయ్యబట్టారు. గతంలో గోదావరి వరదల సందర్భంగా పంప్‌హౌజ్ మునిగిపోయిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పగా చెప్పుకున్నారని, కానీ వాస్తవంలో బొక్కబోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. 

‘కాళేశ్వరం’తో ఏటా 400 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామని అప్పట్లో కేసీఆర్ ఘనంగా ప్రకటించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం 100 టీఎంసీలే ఎత్తిపోశారన్నారు. బ్యారేజీ వంతెన కుంగడం చిన్న విషయం కాదని హెచ్చరించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టు ఇదని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్యామ్ సేఫ్టీ మీద అథారిటీ ఏర్పాటు చేసి రిపోర్టు తయారు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KCR
Kishan Reddy
BJP
BRS
Kaleshwaram Project

More Telugu News