కెనడాలో పడరాని పాట్లు పడుతున్న భారత విద్యార్థులు.. వైద్య డిగ్రీలు అందుకుని రెస్టారెంట్లలో బిల్లులు కొడుతూ నెట్టుకొస్తున్న వైనం!
- భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు
- చదువులు పూర్తయినా ఉద్యోగాలు దొరక్క భారత విద్యార్థుల ఇక్కట్లు
- గతేడాది కెనడాకు 2,26,450 మంది విద్యార్థులు
భారత్-కెనడా మధ్య విభేదాల గురించి తాను అంతగా ఆలోచించడం లేదని, తన ఆందోళనంతా భవిష్యత్తు కోసమేనని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాల కొరత చాలా ఉందని, చదువు పూర్తయ్యాక ఉద్యోగం పొందగలనో, లేదోనని మరో విద్యార్థి చెప్పుకొచ్చాడు. గ్రేటర్ టొరంటో పరిధిలోని చాలామంది విద్యార్థులు ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ-ఒట్టావా మధ్య దౌత్యపరమైన ప్రతిష్ఠంభన తర్వాత చదువు పూర్తయినా పని దొరకలేదనే ఆలోచన తనకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోందని ఇంకో విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇక్కడ వైద్య డిగ్రీలు అందుకున్న ఎంతోమంది భారతీయ విద్యార్థులు తనకు తెలుసని, వారందరూ మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందలేకపోయారని, దీంతో వారు క్యాబ్‌లు, దుకాణాలు నడుపుకుంటున్నారని, మరికొందరు రెస్టారెంట్లలో పనిచేస్తున్నారని తెలిపాడు. ఇది చాలా సవాలుతో కూడిన పరిస్థితి అని మరికొందరు విచారం వ్యక్తం చేశారు.