Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టే కదా... ఇందులో జగన్ కక్ష సాధించింది ఎక్కడ?: సజ్జల

Sajjala press meet on Chandrababu issue
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కడుపుకొట్టి అందులోంచి సొమ్ము వెనకేసుకోవాలన్న ఆలోచనే దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. 

ఆ కుంభకోణాన్ని విజయవంతంగా అమలు చేశారని, కానీ ఇవాళ లీగల్ గా అన్నీ కరెక్టుగానే ఉన్నాయని అంటున్నారని, వైసీపీ కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అని, ప్రజలు నమ్మక చస్తారా అనే రీతిలో టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని సజ్జల విమర్శించారు. 

చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికే పెద్ద విఘాతం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు, మిగతా పార్టీల వాళ్లు కూడా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని, వాళ్లెంతకు అమ్ముడుపోయారో అంటూ సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మదిలో మాటలను ఎందుకు చిలకపలుకుల్లా పలుకుతున్నారో ఆయా పార్టీల నేతలు ఓసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

దొంగతనం చేసి దొరికిపోయిన చంద్రబాబుకు మద్దతివ్వడం సరైనదేనా? అని ప్రశ్నించారు. విషయం ఉంటే మాట్లాడండి... స్కాం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడంలేదని సజ్జల నిలదీశారు. ఇవీ ఆధారాలు అని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని, చంద్రబాబుకు రిమాండ్  విధించింది కోర్టే కదా అని వ్యాఖ్యానించారు. ఇందులో జగన్ కక్షపూరితంగా వ్యవహరించింది ఎక్కడ? అని ప్రశ్నించారు. ప్రజాధనం దోపిడీకి గురైందని సీఐడీ దర్యాప్తు చేసి ఆధారాలు సమర్పించిందని తెలిపారు. 

"కక్ష సాధించాలని అనుకుంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు హెలికాప్టర్ పెట్టాల్సిన అవసరం లేదు... ఏదో ఒక లారీ పెట్టొచ్చు, లేదా వ్యాన్ లో ఎక్కించి తీసుకుని రావొచ్చు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. ఐదు కోట్ల మందికి పచ్చ కళ్లద్దాలు పెట్టాలని, చెవిలో కాలీఫ్లవర్ లు పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు... రేపు ఐక్యరాజ్యసమితికి కూడా వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని సజ్జల పేర్కొన్నారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Skill Development Case
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News