సొంత ఇంటికే కన్నం.. ప్రియుడి కోసం రూ. కోటి దోపిడీ చేయించిన కూతురు!

Daughter Orchestrates Crore Rupee Robbery for Lover in Moradabad
  • ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘటన
  • ఏడెనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • పెళ్లికి మతం అడ్డుకావడంతో ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని ప్లాన్
  • అందులో భాగంగా సొంత ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసిన యువతి
  • ఐదుగురు నిందితుల అరెస్ట్
  • రూ. 47.24 లక్షల నగదు, నాలుగు నాటు తుపాకులు, కార్లు స్వాధీనం
ప్రేమించిన వాడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు సొంత ఇంటికే కన్నం వేసిందో కూతురు. ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే కోటి రూపాయలకు పైగా దోపిడీకి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఈ సంచలన ఘటనలో వ్యాపారి కూతురు, ఆమె ప్రియుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం మొరాదాబాద్‌కు చెందిన ఇత్తడి వ్యాపారి మహమ్మద్ ఇమ్రాన్ ఇంట్లో మే 11న తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. సాయుధులైన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించి బందీలుగా చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు రూ.1.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో ఇమ్రాన్, ఆయన భార్య సీమా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు.

విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో ఇమ్రాన్ కుమార్తె అరిబా, అమ్రోహాకు చెందిన అర్షద్ వార్సీ అనే యువకుడు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని తేలింది.

అయితే, వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో వారి పెళ్లికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో దొంగిలించిన డబ్బుతో ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారు ప్లాన్ చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్న విషయాన్ని అరిబా తన ప్రియుడు అర్షద్‌కు తెలిపింది. దోపిడీకి నెల రోజుల ముందే ఇంటి ప్రధాన గేటు తాళాన్ని అతడికి అందించింది. దోపిడీ జరిగిన రోజు దుండగులు సులభంగా లోపలికి వచ్చేందుకు ఇంటి డిజిటల్ లాక్‌ను ఆమె స్వయంగా తెరిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో అరిబా, ఆమె ప్రియుడు అర్షద్ వార్సీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 47.24 లక్షల నగదు, నాలుగు నాటు తుపాకులు, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్మును రికవరీ చేసేందుకు, ఈ నేరంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Arbaaz Warsi
Moradabad robbery
Uttar Pradesh crime
love affair
family theft
police investigation
crime news
digital lock
cash recovery
illegal weapons

More Telugu News