ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నా: వీరేంద్ర సెహ్వాగ్
- పేరు మనలో గర్వాన్ని నింపేలా ఉండాలన్న సెహ్వాగ్
- ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు అని వ్యాఖ్య
- ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై భారత్ అని ఉండాలని సూచన
ఇక ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.
'పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా' అని ట్వీట్ చేశారు.