నన్ను కొట్టినట్టు అమిత్ షా, నడ్డాలను కూడా కొడతారా?: జగన్ కు రఘురామకృష్ణరాజు ప్రశ్న

  • వైసీపీ ప్రభుత్వ అవినీతిపై అమిత్ షా, నడ్డాలు మాట్లాడారన్న రఘురాజు
  • గతంలో తాను కూడా ఇవే మాటలు చెప్పానని వ్యాఖ్య
  • వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష
ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఎలాంటి దాపరికం లేకుండా క్షిపణి మాదిరి జగన్ ప్రభుత్వంపై సూటిగా దాడి చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అమిత్ షా విమర్శించారని అన్నారు. 

మొన్న నడ్డా కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని.. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక, ల్యాండ్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటిలో అవినీతి జరుగుతోందని అన్నారని తెలిపారు. అమిత్ షా, నడ్డా చెప్పిన మాటలే తాను గతంలో చెప్పానని... దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కుట్రలు చేస్తున్నానంటూ రాజద్రోహం కేసు పెట్టారని మండిపడ్డారు. అమిత్ షా, నడ్డాల విషయంలో జగన్ స్టాండ్ ఏమిటని... తనను కొట్టినట్టే వీరిని కూడా కొడతారా? అని ప్రశ్నించారు. 

జగనన్న విద్యా దీవెన సభలో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రిని రఘురాజు ప్రశ్నించారు. విద్యావ్యవస్థకు జగన్ ఏం చేస్తున్నారని అడిగారు. జగన్ బయోపిక్ తో సినిమా చేస్తున్నారని... ఆ సినిమాను ప్రజలెవరూ చూడరని అన్నారు. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Amit Shah
JP Nadda
BJP

More Telugu News