Ketireddy Venkatramreddy: మీకు చాకిరి చేయడం తప్ప మాకు వేరే పనే లేకుండాపోతోంది.. ప్రజలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు

‘మీకు చాకిరి చేయడం తప్ప మాకు వేరే పనే లేకుండాపోతోంది’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేనికీ ఆగలేరు కాబట్టే.. మన బతుకులు ఇట్లున్నాయి’ అంటూ ప్రజలపై ఆయన అక్కసు వెల్లగక్కారు.

ఇటీవల ధర్మవరం పట్టణంలో ఆసరా చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘టిఫిన్లు ఇప్పుడే తిన్నారు. అప్పుడే అన్నానికి పోతున్నారు. దేనికీ తట్టుకోలేరు కాబట్టే.. మన బతుకులు ఇట్లున్నాయి’’ అంటూ మహిళలపై మండిపడ్డారు.

 ‘‘పొద్దున 6.30 నుంచి 9.30 గంటల వరకు నేను వీధుల్లో తిరుగుతాను. 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నా భార్య తిరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నా తమ్ముడు తిరుగుతున్నాడు. మా కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడం తప్ప వేరే పనే లేకుండాపోతోంది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసినా తమ మీద ఏడుపేనని అసహనం వ్యక్తం చేశారు.

ధర్మవరానికి తాగు నీళ్లు తీసుకొచ్చింది తానేనని చెప్పారు. అంతకుముందు నీళ్ల కోసం మహిళలు కొట్టుకునే వాళ్లని, ఇప్పుడు అలా లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Ketireddy Venkatramreddy
dharmavaram
YSRCP

More Telugu News