తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

10th exams in Telangana starts from today
  • మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది ఇంగ్లిష్ మీడియం వారే
  • రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల ఏర్పాటు
  • 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
  • తొలి రోజులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి
  • కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. 

మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.

11కు బదులు ఆరే..
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా, ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి  8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి  కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 

అధికారులకూ నో చాన్స్
చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు సహా పరీక్ష హాల్లో ఎవరూ మొబైల్ వాడానికి కానీ, తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్‌ను లీక్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను  పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అంతేకాదు, ఆయా పాఠశాలల కరస్పాండెట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాపీయింగ్ కనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈవోలు, డీఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

హాల్ టికెట్లతో ఉచిత ప్రయాణం
సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద ఎంఈవో, డీఈవో నంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక, కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ‘పది’ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
Go Back to Shorts
Telangana
Tenth Exams
Telangana 10th Exams
10th Students
TSRTC

More Telugu News