ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారు: చంద్రబాబు
- వైసీపీ గూండాలతో చేతులు కలిపిన పోలీసులకు డీజీపీ మద్దతుగా నిలుస్తున్నారన్న చంద్రబాబు
- టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు
- యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ లేకుండానే నిందితులను తీసుకెళ్తున్నారని విమర్శ
పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారనే విషయం కోర్టుల్లో రిమాండ్ ల తిరస్కరణల ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు యూనిఫాం లేకుండానే, నేమ్ బ్యాడ్జ్ ధరించకుండానే వచ్చి నిందితులను తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పారు.