Santhi Kumari: తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారి.. రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్ గా రికార్డ్

A Santhi Kumari apponted as new CS of Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను కూడా స్వీకరించారు. సీఎస్ గా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. మరోవైపు తనకు సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను శాంతికుమారి కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి అభినందించారు. 

శాంతికుమారి 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేసీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.

శాంతికుమారి ఆంధ్రయూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని కొనసాగించడం గమనార్హం. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన ఆమె... అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌ అధికారిణిగా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.
 
ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ కు చెందినవారని... ఆయనను తక్షణమే ఏపీకి బదిలీ చేయాలంటూ నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ డీవోపీటీ (కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల విభాగం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ ను ఆదేశించింది. సోమేశ్ కుమార్ మూడేళ్ల నుంచి సీఎస్ గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Go Back to Shorts
Santhi Kumari
IAS
CS
Telangana

More Telugu News