మనం చేసే పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలి: శోభిత ధూళిపాళ
- మనల్ని మనం గౌరవించుకోవడం ముఖ్యమన్న శోభిత
- మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని సూచన
- అప్పుడే మహిళలు సమాజంలో ఎత్తుకు ఎదుగుతారని వ్యాఖ్య
సినీ నటి, హీరో అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ తన కెరీర్‌తోనే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. నాగచైతన్యతో వివాహం తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, వృత్తి పరంగా కూడా ఆమె బిజీగా ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళలను అభినందిస్తూ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ జాబితాలో శోభిత పేరును కూడా ప్రస్తావించడం విశేషం. ప్రపంచ వేదికలపై తెలుగు వారి ప్రతిభను చాటుతున్న మహిళలందరినీ ఒకే చోట చేర్చి గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది.
శ్రీలత పోస్ట్‌పై శోభిత స్పందిస్తూ తన జీవిత సూత్రాన్ని పంచుకున్నారు. జీవితంలో మనం చేసే ప్రతి పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలని... అప్పుడే ఆ క్షణాలు అర్థవంతంగా ఉంటాయని చెప్పారు. ఇతరుల కోసం కాకుండా, మనకు మనం నిజాయతీగా ఉండటం, మనల్ని మనం గౌరవించుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారానే సమాజంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదుగుతారని తెలిపారు.