ఉద్యోగి మరణిస్తే.. ఈపీఎఫ్ వో నుంచి కుటుంబానికి పెన్షన్
- కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే చాలు
- ఆధారపడిన కుటుంబం లేదా తల్లిదండ్రులకు పెన్షన్
- ఉద్యోగి వైకల్యం పాలైనా జీవితాంతం పింఛను చెల్లింపులు
ఈఫీఎఫ్ లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి.. ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, అతడిపై ఆధారపడిన కుటుంబం లేదా తల్లిదండ్రులు జీవించినంత కాలం పింఛను పొందేందుకు అర్హులు. ఉద్యోగి లేదా ఉద్యోగిని కోల్పోయిన తల్లిదండ్రులకు జీవించి ఉన్నంత కాలం పింఛను ఇవ్వాలని ఈపీఎఫ్ వో నిబంధనలు చెబుతున్నాయి. కాకపోతే కొన్ని షరతులు ఇందుకు వర్తిస్తాయి.
ఇందులో ప్రధానమైనది ఉద్యోగి మరణించే నాటికి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి సర్వీస్ లో ఉండగా ఏదైనా ప్రమాదం లేదా వ్యాధి కారణంగా వైకల్యం పాలైనా జీవించి ఉన్నంత కాలం పింఛన్ కు అర్హులు. ఉద్యోగి పనిచేయలేని విధంగా వైకల్యం పాలైతే పింఛను పొందేందుకు 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలన్న నిబంధన లేదు. ఉద్యోగి వేతనం నుంచి (మూలవేతనం, డీఏ కలిపి గరిష్ఠంగా రూ.15,000) 12 శాతం ఈపీఎఫ్ కు వెళుతుంది. సంస్థ కూడా ఉద్యోగి తరఫున 12 శాతం చందా అందిస్తుంది. అందులో 8.33 శాతమే భవిష్యనిధికి వెళుతుంది. మిగిలిన 3.67 శాతం పింఛను ఖాతాకు వెళుతుంది. దీన్నుంచే పెన్షన్ చెల్లింపులు చేస్తారు.