సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన 'వచ్చిన వాడు గౌతం' చిత్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన 'వచ్చిన వాడు గౌతం' చిత్రం

Vachina Vadu Goutham movie opening held at Ramanaidu Studio in Hyderabad
  • అశ్విన్ బాబు, పాలక్ లాల్వాని జంటగా కొత్త చిత్రం
  • డీఎస్సార్ నిర్మాతగా మెడికో థ్రిల్లర్ మూవీ
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎంఆర్ కృష్ణ
  • హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
  • మే నెలలో సినిమా విడుదల
శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్  లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు నటిస్తున్న కొత్త చిత్రం 'వచ్చిన వాడు గౌతం'. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

పూజా కార్యక్రమాల అనంతరం నటుడు, చిత్ర నిర్మాత డీఎస్సార్ మాట్లాడుతూ... కరోనా తర్వాత చాలా మంది నిర్మాతలు సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారని, అయితే తాను చాలా రోజులు బ్రేక్ తీసుకొని సినిమా తీస్తున్నానని వెల్లడించారు. దర్శకుడు ఎంఆర్ కృష్ణ చెప్పిన మెడికో థ్రిల్లర్ కథ తనకు, హీరో అశ్విన్ బాబుకు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. 

కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయి అని సురేష్ బాబు చెప్పడంతో సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో ఈ కథ చెప్పించి అందరినీ ఒప్పించి వారి ఆశీస్సులతోనే ఈ సినిమా ప్రారంభిస్తున్నట్టు నిర్మాత డీఎస్సార్ వివరించారు. దర్శకుడు ఎంఆర్ కృష్ణ ఈ చిత్రంలో హీరో పాత్రను చక్కగా డిజైన్ చేశారని, హీరో అశ్విన్ బాబును కొత్త కోణంలో చూపించబోతున్నారని తెలిపారు. 

పెద్ద సినిమాలకు పనిచేసిన  టెక్నిషియన్స్ తమ చిత్రానికి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆకట్టుకునే కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి  'వచ్చిన వాడు గౌతం' అనే టైటిల్ పెట్టడం జరిగిందని, జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని డీఎస్సార్ చెప్పారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సహకారంతో వచ్చే ఏడాది మే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 

ఇక నుంచి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. త్వరలో ఒక యూత్ హీరోతో కూడా సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు. మంచి కథతో వస్తున్న 'వచ్చిన వాడు గౌతం' చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని డీఎస్సార్ అన్నారు. 

కాగా, ఈ చిత్రానికి హరిహర సంగీతం అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్స్ లు సమకూర్చుతున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Advertisement
Vachina Vadu Goutham
DSR
Ashwin Babu
Palak Lalwani
MR Krishna
Tollywood

More Telugu News