అలీ, పోసాని కృష్ణమురళికి త్వరలోనే పదవులు ఇవ్వనున్న జగన్?

2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ కోసం సినీ నటులు అలీ, పోసాని కృష్ణమురళి తమ వంతుగా చాలా ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం వీరు చేసిన సేవలకు గాను ఇద్దరికీ ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇవ్వనున్నారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఇప్పుడు సమయం ఆసన్నమయినట్టుంది. ఇద్దరికీ పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. 

అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా, పోసానిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని సమాచారం. 

అలీ విషయంలో గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయనను రాజ్యసభకు పంపబోతున్నారంటూ ఒకసారి, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ చేస్తారంటూ మరోసారి ప్రచారం జరిగింది. పోసానికి కూడా పదవిని ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరిద్దరికీ ఒకేసారి పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్టు చెపుతున్నారు.


More Telugu News