Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులకు దొరకకూడదని టెడ్డీబేర్​ లో దాక్కున్న దొంగ!

UK police catch wanted thief hiding in teddy bear
  • ప్రేయసి ఇంట్లో ఉండగా దాడి చేసిన పోలీసులు
  • టెడ్డీ బేర్ లో దూరి ఓ పక్కన పడి ఉన్నట్టు కూర్చున్న దొంగ
  • శ్వాస తీసుకుంటున్నప్పుడు టెడ్డీ బేర్ ఛాతీ భాగం కదలడం చూసిన పోలీసులు
  • అనుమానంతో తీసి చూస్తే దొరికిపోయిన దొంగ
అతనో దొంగ.. వయసు కూడా 18 ఏళ్లే.. పెద్ద పెద్ద కార్లు కొట్టేయడం దగ్గరి నుంచి సూపర్ మార్కెట్లలో సరుకులు కొట్టేయడం దాకా ఎన్నో కేసులు అతనిపై ఉన్నాయి. పోలీసులు అతడి కోసం సీరియస్ గానే వెతుకుతున్నారు. దీంతో తన ప్రేయసి ఇంటికి వెళ్లి దాక్కున్నాడు. పోలీసులకు ఇది తెలిసి, ఆ ఇంటిపై రైడ్ చేశారు.

పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న సదరు దొంగ ఓ చిత్రమైన ప్లాన్ వేశాడు. ప్రేయసికి గతంలో తాను బహుమతిగా ఇచ్చిన ఐదు అడుగుల పెద్ద టెడ్డీబేర్ ను దీనికి వాడుకున్నాడు. టెడ్డీ బేర్ లోని దూది అంతా తీసేసి.. అందులో దూరాడు. టెడ్డీబేర్ ను ఓ మూల పడేసినట్టుగా వెళ్లి ఓ పక్కన కూర్చుండిపోయాడు. అయినా పోలీసులు పట్టేసుకున్నారు. ఇదంతా బ్రిటన్ లోని మాంచెస్టర్ లో జరిగింది. సదరు దొంగ పేరు జోషువా డాబ్సన్. మరి ఎలా దొరికిపోయాడో తెలుసా?

 జోషువా డాబ్సన్‌ ఇటీవల ఓ కారును దొంగతనం చేశాడు. ఆ కారులో పెట్రోల్ పోసుకుని బంకు నుంచి డబ్బులు కట్టకుండా పరారయ్యాడు. ఇంతకు ముందూ మనోడికి ఓ కారు దొంగతనం చేయడం, సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎత్తుకుపోవడం వంటి ‘దొంగ’ చరిత్ర కూడా ఉంది. దాంతో పోలీసులు అతడి గురించి వెతుకులాట మొదలుపెట్టారు. ఇది తెలిసి వెళ్లి తన ప్రేయసి ఇంట్లో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికీ రావడంతో టెడ్డీబేర్ లో దూరి కూర్చున్నాడు.

అంతా బాగానే ఉందిగానీ.. భయపడిపోయో, బాగా ఉద్వేగంలోనో గానీ గట్టిగా శ్వాస తీసుకోవడంతో టెడ్డీబేర్ ఛాతీ భాగం కదిలింది. గాలి ధ్వని వచ్చింది. అనుమానంతో పోలీసులు టెడ్డీ బేర్ ను పరిశీలిస్తే డాబ్సన్ పట్టుబడిపోయాడు. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌ బుక్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏదేమైనా టెడ్డీ బేర్ దొంగ పాపులర్ అయిపోయాడు.
UK
Police
Crime News
Offbeat
Teddy Bear
Thief

More Telugu News