Kodali Nani: క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలుంటే అరెస్ట్ చేయించండి: టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్

gudivada mla kodali nani ask tdp to arrest him if they have courage
షార్ట్స్‌లో చూడండి
గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. వారికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా ఆ పని చేయాలని అన్నారు. పట్టణంలో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

చికోటి క్యాసినో వ్యవహారాన్ని తనపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా రుద్దేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలన్నారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, విదేశాల్లో క్యాసినో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దీనికి సూత్రధారిగా భావిస్తున్న చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడిచేసి సోదాలు నిర్వహించారు. ‘పెద్దలు’ జూదం ఆడేందుకు విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయడమే కాకుండా హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఈడీ వారికి నోటీసులిచ్చింది. 

ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉందన్న ఊహాగానాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాసినో వెనుక చికోటి ప్రవీణ్ ఉందన్న కోణంలో మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని ఇలా స్పందించారు.
Go Back to Shorts
Kodali Nani
Gudivada
Casino
YSRCP
TDP

More Telugu News