శ్రీలంక నూతన అధ్యక్షుడు విక్రమసింఘేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- శ్రీలంకలో తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం
- కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే
- శ్రీలంకకు భారత్ మద్దతు ఉంటుందన్న మోదీ
- మరింత సన్నిహితంగా కలిసి పనిచేద్దామని పిలుపు
శ్రీలంక ప్రజలకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని, శ్రీలంక స్థిరత్వం సాధించేందుకు, ఆర్థికంగా కోలుకునేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో సహకరిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు కొలంబోలో భారత హైకమిషన్ వెల్లడించింది.
శ్రీలంక, భారత్ ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం శ్రీలంక అధ్యక్షుడితో కలిసి కృషి చేస్తామని మోదీ పేర్కొన్నట్టు భారత దౌత్య వర్గాలు తెలిపాయి. శ్రీలంక, భారత్ ల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న సన్నిహిత మైత్రిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళతామని మోదీ వివరించినట్టు వెల్లడించాయి.