దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: షరీఫ్

MA Sharif slams YCP leaders over Pedda Dastagiri murder
  • దస్తగిరి హత్య వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ఎంఏ షరీఫ్ విమర్శ
  • వివేకా హత్య తరహాలోనే 'గంజాయి ముఠా' కథతో కప్పిపుచ్చే యత్నమని ఆరోపణ
  • రూ.500 కోట్ల భూవివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడి
  • సాక్షి పత్రికలో బ్యానర్ వార్తతో అసలు దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపణ
పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అనుసరిస్తున్న గొడ్డలి రాజకీయాలే ఉన్నాయని, ఇది వారి రాక్షస రాజకీయాలకు పరాకాష్ఠ అని ప్రభుత్వ మైనార్టీ విభాగం సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రంగా విమర్శించారు. సొంత పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే అడ్డు తొలగించుకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను 'గుండెపోటు'గా చిత్రీకరించినట్టే, నేడు దస్తగిరి హత్యను 'గంజాయి ముఠా' ఘర్షణగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

హత్య జరిగిన మరుసటి రోజే, ఎలాంటి విచారణ జరగకముందే సాక్షి పత్రికలో "గంజాయి ముఠా దారుణ హత్య" అని బ్యానర్ వార్త రాయడం వెనుక అసలు హంతకులను కాపాడే కుట్ర దాగి ఉందని షరీఫ్ అన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలోనే ఇది భూవివాదాల కారణంగా జరిగిన అంతర్గత హత్య అని తేలిందని, దస్తగిరి ఇంట్లో దొరికిన రూ.500 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 150కి పైగా దస్తావేజులే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, దస్తగిరి శవం వద్ద కన్నీళ్లు కార్చడం చూస్తే.. వివేకా హత్య తర్వాత అవినాష్ రెడ్డి నటన గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు.

న్యాయం చేయాలని దస్తగిరి భార్య వైసీపీ కార్యాలయంలోనే వేడుకుంటుంటే, ఆమె పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని షరీఫ్ అన్నారు. కేసీ కెనాల్ ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మడంలో దస్తగిరి కీలకపాత్ర పోషించారని, ఆ లావాదేవీల్లో తేడాలు రావడంతోనే పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆరోపించారు. "గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు బలిస్తాం" అని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ హత్యలు జరుగుతున్నాయని, అధికారం కోల్పోయినా వారి హంతక ప్రవృత్తి మారలేదని విమర్శించారు.

సొంత చిన్నాన్నను, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కూడా వదలని వీరు, సామాన్య ప్రజల మానప్రాణాలను ఎలా కాపాడతారని షరీఫ్ ప్రశ్నించారు. ప్రజలు తమ అరాచక పాలనను చూసే 11 స్థానాలకు పరిమితం చేశారని, అయినా వారిలో మార్పు రాలేదని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు, దౌర్జన్యాలకు పాల్పడే శక్తులపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pedda Dastagiri Murder
MA Sharif
TDP
YSCRP
Andhra Pradesh

More Telugu News