పెళ్లి చేసుకున్నా అత్యాచారం కేసు అలానే ఉంటుంది: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- 14 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
- ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చిన బాధితురాలు
- బాధితురాలిని వివాహం చేసుకున్నానన్న నిందితుడు
- అయినా కేసు తొలగిపోదన్న న్యాయస్థానం
- బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ
బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసుల్లో బాధిత బాలిక అంగీకరించిందా? లేదా? అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది. ఒకవేళ బాలిక తెలివి తక్కువ తనంతో అంగీకరించినా చట్టం ప్రకారం దానికి గుర్తింపు లేదని స్పష్టం చేసింది.
అయితే, బాధిత బాలికను తాను గుడిలో వివాహం చేసుకున్నానని, కాబట్టి తనకు బెయిలు మంజూరు చేయాలని నిందితుడు కోరాడు. స్పందించిన న్యాయస్థానం.. బాధిత బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన అతడు పవిత్రుడైనట్టు కాదని పేర్కొంటూ బెయిలు ఇచ్చేందుకు తిరస్కరించింది. పెళ్లి చేసుకున్నానన్న కారణంతో అతడు కేసు నుంచి తప్పించుకోలేడని తేల్చి చెప్పింది.