Karnataka: పెళ్లికి నిరాకరించిన యువతి.. తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు!

Youth Killied girl for denied to marry him in karnataka
  • కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఘటన
  • రెండు నెలల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్న నిందితుడు
  • ఇంటికి వెళ్లి బాధితురాలితో గొడవ
  • ఆపై వెంట తీసుకెళ్లిన కత్తితో తలనరికి చంపిన వైనం
తనతో పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. ఆమె తల నరికి చంపేశాడు. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి సంచిలో వేసుకుని తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. బంధువైన బసన్న కుమార్తె నిర్మల (21) బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడిన భోజరాజ ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భోజరాజకు మరో యువతితో వివాహమైంది. 

నిర్మల ఇటీవల స్వగ్రామానికి రాగా విషయం తెలిసిన భోజరాజ నిన్న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆమెను హత్య చేసే ఉద్దేశంతో వెంట కత్తి తీసుకెళ్లిన భోజరాజ కత్తితో ఆమె తల నరికి హత్య చేశారు. ఆపై మొండెం నుంచి తలను వేరుచేసి దానిని సంచిలో వేసుకున్నాడు. అనంతరం బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Vijayanagara
Murder
Crime News

More Telugu News