పండ్లు, కూరగాయలతో.. వృద్ధాప్యాన్ని కాస్తంత వెనక్కి నెట్టేయవచ్చు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పండ్లు, కూరగాయలతో.. వృద్ధాప్యాన్ని కాస్తంత వెనక్కి నెట్టేయవచ్చు!

Fruits and vegetables to consume to slow down ageing process
  • పెరిగిపోతున్న పని ఒత్తిళ్లు 
  • ఒత్తిడి పెరిగిపోతే త్వరగా వృద్ధాప్యం 
  • దీంతో ముందుగానే పలు వ్యాధులు
  • పండ్లు, కూరగాయలతో చెక్ పెట్టచ్చు 
ఏ వృత్తిలో ఉన్న వారికైనా నేడు పని ఒత్తిళ్లు తప్పడం లేదు. అంటే మనం పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి విశ్రమించేంత వరకు ఒత్తిడితో సహజీవనం చేస్తున్నాం. వృద్ధాప్యాన్ని తొందరగా ఆహ్వానించడం అంటే ఇదే. దీనివల్ల కొన్ని రకాల వ్యాధులు ముందుగానే పలకరిస్తాయి. ఇక మనం తీసుకునే రెడీమేడ్ ఆహారం, ఇన్ స్టంట్ ఫుడ్స్ లో వాడే రసాయనాలు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి, వృద్ధాప్యానికి తొందరగా దారి కల్పిస్తాయి. 

దీనిపై ప్రముఖ వైద్యులు, పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ మాట్లాడుతూ.. ‘‘మనం నేడు అసాధారణ స్థాయిలో పర్యావరణ విధ్వంసం చూస్తున్నాం. ఇది కొన్ని వ్యాధులకు, వృద్ధాప్యానికి దారితీస్తుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మన కణాలు యవ్వనంగా, చురుగ్గా, వ్యాధులకు దూరంగా ఉంటాయి’’ అని చెబుతున్నారు. పాలీఫెనాల్ తగినంత లభించే పండ్లు, కూరగాయలను ఆమె సూచించారు. 

క్యాబేజీ
ఇదొక క్రూసిఫెరోస్ రకం కూరగాయ. ఇందులో ఇండోల్-3 కార్బినోల్ ఉంటుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య వ్యతిరేక గుణాలు కలిగి ఉంటుంది.

క్యారట్లు
ఇందులో పోషకాలు ఎక్కువ. కొలెస్టరాల్ ను తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే శక్తి ఉంది.

ద్రాక్ష
ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణాలకు ఫ్రీ రాడికల్స్ (హానికారకాలు) నుంచి హాని జరగకుండా అడ్డుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. ఫ్రీరాడికల్స్ మన శరీరంలో పెరిగిపోతే గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్ బారిన పడే రిస్క్ ఎదురవుతుంది.

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు, వెల్లుల్లిలో వృద్ధాప్య వ్యతిరేక సామర్థ్యాలు ఎక్కువ. వీటిల్లో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లమేషన్ గా పనిచేస్తుంది. రక్తాన్ని పలుచన చేసి, మంచి కొలెస్టరాల్ పెరిగేందుకు సాయపడతాయి.

టమాటాలు
వీటిల్లో లైకోపీన్ ఉంటుంది. ఇదొక శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేన్సర్, వృద్ధాప్యాన్ని కూడా అడ్డుకోగలదు.

పాలకూర
పాలకూరలో ఉండే లుటీన్ వృద్ధాప్యాన్ని నిరోధించగలదు. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ డీఎన్ఏను బాగు చేస్తుంది. ఇది కూడా వృద్ధాప్యం ఆలస్యం అయ్యేందుకు సాయపడుతుంది.
Fruits
vegetables
ageing
slow down

More Telugu News