త్వరలోనే శుక్రగ్రహంపైకి ప్రయోగం.. వెల్లడించిన ఇస్రో చైర్మన్

Plan Ready For Venus Mission Says ISRO Chairman Somnath
  • వీనస్ మిషన్ ప్లాన్ సిద్ధమైందన్న సోమనాథ్
  • నిధులూ సమకూరాయని వెల్లడి
  • కొత్తదనంతో ప్రయోగం చేస్తామని ప్రకటన
సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు (వీనస్). మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం అనీ దానిని పిలుస్తుంటారు. ఒకప్పుడు మన భూమ్మీద ఉండే వాతావరణమే దానిపైనా ఉండేదని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. కానీ, ఆ తర్వాత గ్రహం తీవ్రమైన వేడిగా మారిందని చెబుతారు. అంతేకాదు.. దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో అత్యంత విషపూరితమైన గ్రహంగానూ దానికి పేరుంది. 

దానికి గల కారణాలేంటన్నది ఇప్పటికీ రహస్యాలే. ఆ రహస్యాల్నే ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. శుక్ర గ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష ఆధారిత అధ్యయనాలు, పరిశోధనలపై ఇవాళ ఇస్రోలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. 

అతి త్వరలోనే శుక్ర గ్రహం ప్రయోగం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రయోగానికి సంబంధించిన సత్తా, సామర్థ్యం భారత్ కు ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన ప్లాన్ నూ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టామని ఆయన తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి వీనస్ మిషన్ పై పనిచేస్తున్నామని, ఇప్పుడు ప్రణాళిక తయారైందని వివరించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేశామని, వీనస్ లో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసే ఈ ప్రాజెక్టుకు నిధులు కూడా సమకూరాయని చెప్పారు. అతి త్వరలోనే ప్రయోగాన్ని చేపడతామని సోమనాథ్ వెల్లడించారు. 

మంగళ్ యాన్ వంటి ప్రతిష్ఠాత్మక అంగారక ప్రయోగాన్ని భారత్ అతి తక్కువ ఖర్చుతోనే చేయగలగడం, ఇటు చంద్రయాన్ 2ని కూడా ఎవరూ ఊహించని రీతిలో అతి తక్కువ నిధులను వాడుకుని స్లింగ్ షాట్ టెక్నిక్ లో చేపట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే భారత్ వీనస్ పైనా ఫోకస్ పెట్టింది. ఆర్బిటర్ ను పంపి అక్కడి వీనస్ ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 

చంద్రయాన్, మంగళ్ యాన్ తరహాలోనే ఈ మిషన్ లోనూ కొత్తదనాన్ని మిషన్ టీమ్ గుర్తించే పనిలో ఉందని సోమనాథ్ చెప్పారు. ప్రయోగంలో భాగంగా కొన్ని విషయాలను రిపీట్ చేసినా నేరమేం కాదని, కానీ, ప్రయోగంలో ఏదైనా కొత్తదనం ఉంటేనే ప్రపంచం దృష్టిని ఆకర్షించగలుగుతామని ఆయన తెలిపారు. 

వీనస్ పై మన దేశం ఒక్కటే కాదు.. అమెరికా వంటి అగ్రరాజ్యాలూ ప్రత్యేక దృష్టిని సారించాయి. ఉన్నట్టుండి అది నిప్పుల గోళంగా ఎలా మారిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉబలాట పడుతున్నాయి. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపనుంది. అందుకోసం 100 కోట్ల డాలర్లను ప్రస్తుతానికి కేటాయించింది. 

డావిన్సి, వెరిటాస్ అని రెండు మిషన్లను చేపట్టనుంది. 2028 నుంచి 2030 మధ్య ఆ రెండు ప్రయోగాలను నిర్వహించనుంది. అంతేగాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) కూడా ఎన్విజన్ పేరిట మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వీనస్ కక్ష్యలోకి ఆర్బిటర్ ను పంపనుంది. కాగా, అతి త్వరలోనే వీనస్ ప్రయోగాన్ని చేపడతామన్న ఇస్రో.. స్పేస్ క్రాఫ్ట్ తయారీపై మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది. 

Go Back to Shorts
ISRO
India
Venus
Space
Somnath

More Telugu News