Vijay Babu: మలయాళ నటుడు విజయ్ బాబుపై రేప్ కేసు.. మూవీ రోల్స్ కోసం టార్చర్ చేశాడన్న నటి

Malayalam actor Vijay Babu booked for rape
షార్ట్స్‌లో చూడండి
మలయాళ నటుడు విజయ్ బాబుపై అత్యాచారం కేసు నమోదైంది. అతడి సినిమాల్లో పాత్రల కోసం తనను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలైన నటి ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను విజయ్ బాబు ఖండించారు. ఆమెను అంత సులభంగా విడిచిపెట్టబోనంటూ హెచ్చరించారు. 

ఈ ఏడాది మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు నటుడు విజయ్ బాబు తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఈ నెల 22న బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్టులో పూర్తి వివరాలు రాసుకొచ్చింది.

చిత్ర పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ ఎర్నాకుళంలోని తన అపార్ట్‌మెంట్‌లో విజయ్ బాబు తనను చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేయడంతోపాటు శారీరకంగానూ హింసించినట్టు బాధితురాలు ఆరోపించింది. కాగా, ఈ విషయమై పోలీసులు ఇంకా విజయ్ బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించలేదు. 

విజయ్ బాబు తనకు కొన్నేళ్ల నుంచి తెలుసని, అతడితో కలిసి ఓ సినిమా కోసం పనిచేశానని బాధితురాలు తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన తనకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో సలహాలు ఇస్తూ, స్నేహపూర్వకంగా మెలుగుతూ నమ్మకాన్ని సంపాదించుకున్నాడని తెలిపింది. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను తనకు సంరక్షకుడిగా వ్యవహరించాడని వివరించింది.

అయితే, లైంగికంగా తనను వేధించాడని ఆరోపించింది. అంతేకాదు, అతడితో శృంగారానికి నిరాకరించినందుకు తనపై దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. రుతుస్రావం సమయంలో శృంగారానికి నిరాకరించినప్పుడు తన పొట్టపైన, తన ముఖంపైనా ఉమ్మేవాడని తెలిపింది. ఏం జరుగుతోందో ఆ సమయంలో గుర్తించలేకపోయానని, కానీ ఇప్పుడది అత్యాచారమని తెలుసుకున్నానని పేర్కొంది. 

తన న్యూడ్ వీడియోను రికార్డ్ చేసి బెదిరించాడని, దీంతో తన భద్రత గురించి భయపడ్డానని తెలిపింది. ఇక, ఈ బాధ భరించలేకపోయానని, నోరును అదుపులో పెట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. తనకు న్యాయం జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి బాధను మరెవరూ అనుభవించకూడదని పేర్కొంది. 

అయితే, ఏప్రిల్ 26న రాత్రి ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన విజయ్ బాబు తనపై నటి చేసిన ఆరోపణలను ఖండించాడు. నిజానికి ఆమె చేతిలో చిత్రహింసలకు గురైంది తానేనని చెప్పుకొచ్చాడు. నిజమైన బాధుతుడిని తానేనని అన్నాడు. అంతేకాదు, బాధితురాలి వివరాలను కూడా బయటపెట్టేశాడు. తానేమీ తప్పు చేయలేదని, తానే బాధితుడినని పేర్కొన్నాడు. చట్టం ఆమెనే రక్షిస్తుందని అన్నాడు. ఆమెపై పరువునష్టం కేసు వేస్తానని, ఆమెను అంత తేలిగ్గా తప్పించుకోనివ్వనని హెచ్చరించాడు. తన వద్ద అన్ని రుజువులు ఉన్నాయన్నాడు. విజయ్ బాబు నిర్దోషి అన్న చిన్న వార్తతో ఈ కేసు ముగియాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
Go Back to Shorts
Vijay Babu
Malayalam
Rape Case
Movies

More Telugu News