ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు ఇవే!

Telugu movies releasing this week
  • థియేటర్లలో విడుదలవుతున్న 'బీస్ట్', 'కేజీఎఫ్ 2'
  • ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన హిందీ మూవీ 'జెర్సీ'
  • ఓటీటీలో వస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'బ్లడీ మేరీ'
వేసవి కాలం వచ్చిందంటే సినీ పరిశ్రమలో పూర్తి సందడి నెలకొంటుంది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలతో పాటు, ఎన్నో చిన్న చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ వేసవి ప్రారంభమైనప్పటి నుంచి కూడా 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు:

బీస్ట్: తమిళ సూపర్ స్టార్ విజయ్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా నుంచి వచ్చిన 'అరబిక్ కుత్తు' పాట దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.

కేజీఎఫ్ 2: తమిళ స్టార్ యష్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే 'కేజీఎఫ్' పార్ట్-1 చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమలో ఊహించని విజయాన్ని ఈ చిత్రం సాధించింది. దీంతో 'కేజీఎఫ్ 2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా... రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 

జెర్సీ (హిందీ): నాని హీరోగా వచ్చిన సినిమా 'జెర్సీ' ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఒక క్రికెటర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ చిత్రాన్ని 'జెర్సీ' పేరుతోనే హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రను పోషించారు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది. అయితే 'కేజీఎఫ్ 2' విడుదల నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఏప్రిల్ 22కి వాయిదా పడింది. 

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:
ఏప్రిల్ 14న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా సోనీలివ్ లో, 'దహనం' చిత్రం ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలవుతున్నాయి. ఇదే రోజున జీ5లో 'గాలివాన' వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించిన 'బ్లడీ మేరీ' ఆహాలో ఏప్రిల్ 15న విడుదలవుతోంది.
Movies
Theatres
OTTS

More Telugu News