హృదయ విదారకం: ‘మేం చనిపోతే..’ అంటూ ఉక్రెయిన్ లో పిల్లలవీపులపై వివరాలు రాస్తున్న తల్లులు
- వైరల్ గా మారుతున్న ఫొటోలు
- మూడు రోజుల క్రితం ఓ తల్లి ఆవేదన
- ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఆందోళన
సామాన్య ప్రజలనూ టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని, చంపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయంటున్నారు. ఈ క్రమంలోనే తల్లులు తామెప్పుడు చనిపోతామో తెలియక.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాము చనిపోతే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందోనని సతమతమవుతున్నారు.
ఈ క్రమంలోనే కొందరు తల్లులు తమ పిల్లల వీపులపై కుటుంబ వివరాలు రాస్తున్నారు. ఒకవేళ తాము చనిపోతే ఆ వివరాల ఆధారంగా పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనాస్తాసియా లపాటినా అనే జర్నలిస్ట్ ఓ బాలిక ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
బాలిక తల్లి సాషా మకోవియ్ తన ఇన్ స్టాగ్రామ్ లో మూడు రోజుల క్రితం ఈ ఫొటోను పోస్ట్ చేసింది. తాము చనిపోతే తమ బిడ్డను రక్షించి జాగ్రత్తగా చూసుకోవాలంటూ చిన్నారి వీపుపై రాసింది. ప్రస్తుతం తాము అంతా సురక్షితంగానే ఉన్నామని, అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.