చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఇవాళ రెండేళ్ల గరిష్ఠానికి కొత్త కేసులు
- ఇవాళ ఒక్కరోజే 3,394 మందికి పాజిటివ్
- నిన్నటితో పోలిస్తే రెట్టింపైన కరోనా కేసులు
- పలు సిటీల్లో లాక్ డౌన్ లు ప్రకటించిన ప్రభుత్వం
- షాంఘై సిటీలో స్కూళ్లన్నింటికీ సెలవు
- జిలిన్ మేయర్, చాంగ్చున్ ఆరోగ్యాధికారి తొలగింపు
ఈ ప్రభావంతో షాంఘైలోని స్కూళ్లన్నింటినీ అధికారులు మూసేశారు. ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు. జిలిన్ సిటీలో పాక్షిక లాక్ డౌన్ ను విధించడంతో వేలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారని ఓ అధికారి చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, లక్షణాల్లేని వాళ్లే ఎక్కువగా ఉండడంతో గుర్తించడం కష్టమవుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిలిన్ సిటీలో ప్రతి ఒక్కరికీ ఆరు రౌండ్ల టెస్టింగ్ పూర్తయిందని చెప్పారు. ఆ ఒక్క సిటీలోనే 500 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
90 లక్షల మంది జనాభా ఉన్న చాంగ్చున్ అనే పారిశ్రామిక నగరాన్ని శుక్రవారమే లాక్ డౌన్ చేశారు. జిలిన్ లోని సిపింగ్, దున్హువా అనే చిన్న సిటీల్లో గురు, శుక్రవారాలు లాక్ డౌన్ విధించారు. రష్యా, ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న హుంచున్ సిటీలోనూ లాక్ డౌన్ పెట్టారు. కరోనా రోగుల చికిత్సార్థం ఆ సిటీలో మూడు తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం వైద్యారోగ్యానికి సంబంధించినంత వరకు మౌలిక వసతుల లేమి వేధిస్తోందని, చాలా మందిని ఆసుపత్రుల్లో చేర్చడమూ కష్టతరంగా మారిందని అధికారులు చెప్పారు. జిలిన్ మేయర్, చాంగ్చున్ హెల్త్ కమిషన్ అధిపతులను శనివారం ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.